శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి , అక్క పల్లి గ్రామం.
శివుడు శక్తిస్వరూపుడు...మోక్షదాయకుడు...భవభయ హరుడు. భవబంధాలను తెంచి జీవుడికి ముక్తినొసగే ఆ మహాలింగస్వరూపుణ్ని ధ్యానించినా, పూజించినా, దర్శించినా జన్మధన్యమే. అందుకే బ్రహ్మ, విష్ణు తదితర దేవతలు కూడా అనునిత్యం ఆ మహదేవుణ్ని స్మరిస్తూ.. అర్చిస్తూ... తరిస్తుంటారు. భక్తులు త్రికరణశుద్ధిగా త్రినేత్రుణ్ని పూజిస్తే చాలు... అతను ఇట్టే కరిగిపోయే భోళాశంకరుడు. శివుడు భక్తజన సులభుడు. చెంబెడు నీళ్ళు చిలకరించి, చిటికెడు విబూది చల్లినా... అదే తనకు అందించే గొప్ప ప్రేమగా భావించి మురిసిపోతాడు. అంతటి భక్త...వశంకరుడు... ఆ పరమేశ్వరుడు ఓ మారుమూల అడవిలో... పచ్చని ప్రకృతి ఒడిలో... నిశ్శబ్ద వాతావరణంలో... లింగ స్వరూపుడిగా... స్వయంభూమూర్తిగా... శ్రీ బుగ్గరామలింగేశ్వరుడిగా వెలిసి భక్తజన బాంధవులకు నిరంతరం శుభదర్శనమిస్తూ తరింపజేస్తున్నాడు.
భవ్యాలయ దివ్య చరిత్ర: ఈ శివాలయానికి నాలుగు శతాబ్దాల ఘనచరిత ఉంది. కాలాలకు అతీతంగా, అన్ని రుతువుల్లో సతతం 365 రోజులూ ఉబికి వచ్చే రహస్య జలధార (నీటి బుగ్గ) ఉండటంతో ఈ ఆలయం శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయంగా సుప్రసిద్ధమైంది. కాకులు దూరని కారడవిలాంటి దట్టమైన కీకారణ్యంలో నాలుగు వందల ఏళ్ళ కిందట మునులు, రుషివర్యులు, నిత్యం, నిరాటంకంగా అభిషేకం జరుపుతూ తపస్సు చేసుకునే వారని ప్రతీతి. అందుకే అప్పటి నుంచి ఇప్పటి దాకా నిరంతరం ఈ గంగాధరుడికి గంగమ్మ ఉబికే జలరూపంగా జలాభిషేకం చేస్తునే ఉంది. స్వామిని తాకి పరమ పవిత్రంగా మారుతున్న ఈ జలం కోనేరులో చేరుకుంటోంది. ఆకాశం నుంచి శంభుని శిరస్సుకు గంగ వచ్చి చేరినట్లే...రహస్య జలధార రూపంగా పాతాళ గంగమ్మ ఉబికి ఉబికి వచ్చి శివుణ్ని స్పర్శించి కోనేరులో పవిత్రజలంగా చేరుతోంది. శివలింగం కింద నిరంతరం జలధార ఉప్పొంగుతుండటంతో ఈ క్షేత్రానికి శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం పేరు వచ్చింది. ఈ ఆలయ జలదార ప్రక్కనే ఆంజనేయస్వామి ఆలయం కలదు. రామలింగేశ్వరునికి హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉండి భక్తులకు కొంగుబంగారమై ఈ క్షేత్ర మహిమ నలుదిక్కులు గా వ్యాపింపజేస్తున్నాడు. హనుమాన్జయంతి సమయం లో మండల దీక్షలు పొంది మాలధారణ గావించిన భక్తులకు అభయం ఇస్తూ అభయాంజనేయ స్వామి గా దర్శనమిస్తున్నాడు.
స్వయంభూమూర్తి ప్రాశస్త్యం...: సాధారణంగా హిందూ దేవాలయాల్లో దేవతలు తూర్పు అభిముఖంగా ఉంటారు. కానీ ఈ ఆలయంలో ఈశ్వరుడు పశ్చిమాభిముఖంగా స్వయం భూమూర్తిగా (సహజంగా...ఎవరి ప్రమేయం లేకుండా స్వయంగా) వెలిసి, భక్తజన కోటిని అనుగ్రహిస్తున్నాడు. ప్రశాంత ప్రకృతి ఒడిలో...చుట్టూ ఎత్తైన గుట్టల నడుమ, పక్షుల కిలకిలారావాలు, శతమర్కట విన్యాసాలతో అలరారుతున్న ఈ వనాంతరాన వెలిసిన ఈ దివ్యాలయం... శైవాగమ ఆధ్యాత్మిక వైభవ ప్రాభవానికి ప్రతీకగా నిలుస్తోంది. స్వామి వారి లింగరూపాన్ని స్పర్శించి పారుతున్న ఈ నీరు అత్యంత శక్తిమంతమైనది. ఇది సకలదోష నివారిణి. అందుకే ఆలయ సమీపాన ఉన్న కోనేరులో పవిత్రస్నానమాచరించి బుగ్గరామలింగే శ్వరుణ్ని సందర్శిస్తే , కోటిజన్మల పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మిక. కొందరు రైతులు ఈ బుగ్గ నీటిని తమ పంటపొలాల్లో చల్లితే పంటలకు ఎలాంటి చీడపీడలు పట్టవని విశ్వస్తారు. తమ నమ్మిక నూటికి నూరుశాతం నిజమని నిరూపితమైందని భక్తులు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు.
వైభవోపేత ఉత్సవాలు: శివుడికి ప్రత్యేకమైన శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయంలో రెండురోజుల పాటు అంగరంగవైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే ఏటా మాఘ అమావాస్య రోజున ఘనంగా ఉత్సావాలు జరుగుతాయి. హిందూ సంప్రదాయంలో సముద్ర స్నానం, పుణ్య నదుల స్నానంకు చాలా విశిష్టత ఉంది ప్రత్యేకంగా మాఘ అమవాస్య రోజున ఈ పుణ్య స్నానాలకు చాలా ప్రత్యేకత ఉంది. సముద్ర స్నానం, గంగ మొదలు అన్ని పుణ్య నదులలో స్నానమాచరిస్తే ఎంత పుణ్యమో ఈ క్షేత్రం లోని కోనేరు లో స్నానమాచరించన అంతే పుణ్యమని బావించి పరిసర ప్రాంతాల్లో జనులే కాకుండా సుదూర ప్రాంతాలనుండి భక్తులు వచ్చి కోనేరులో స్నానమాచరంచి ఆ స్వామి దర్శనం తో జన్మ ధన్యం చేసుకుంటారు. ఈ రోజు గ్రామస్థులు వచ్చిన భక్తులకు సకల సదుపాయలు కల్పించి భోజన ప్రసాద వితరణ కూడా చేస్తారు. ఈ రోజు మాఘమాస జాతర అనే పేరు తో ప్రసిద్ది. ఈ ఉత్సవాల్లో పాలుపంచుకునేందుకు చుట్టపక్కల గ్రామాల ప్రజలతోపాటు ఇతర మండలాలు... కోనరావుపేట, మాచారెడ్డి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాలకు చెందిన భక్తులు అత్యధికంగా వస్తుంటారు. ఉగాది, శ్రీరామ నవమి లాంటి పర్వ దినముల కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అందరూ కలిసి...దారి వేసి : వందల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామిని సందర్శించాలని భక్తులు అనునిత్యం కలవరించి పలవరిస్తునే ఉంటారు. కానీ గతంలో ఈ ఆలయానికి చేరుకోడానికి సరైన దారి లేకపోవడంతో భక్తాదులు విపరీతంగా ఇబ్బందులు పడేవారు. ఎవరో వస్తారని ఎదురు చూడక ప్రజలు సమస్యను తామే పరిష్కరించుకుని చక్కని దారి వేసుకుని ఆ దివ్యమూర్తిని కనులారా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎల్లారెడ్డి పేట పోలీసులు, గ్రామస్థులు, స్థానిక భక్తులు అందరూ కలిసికట్టుగా కదలి చక్కని దారి నిర్మించుకున్నారు. అలాగే ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల సాయంతో ఆలయం వరకు పక్కా రోడ్డు నిర్మాణం చేపట్టారు. గ్రామంలో కొందరు యువకులు స్వచ్చందంగా పుణ్యదినాల్లో బుగ్గలింగేశ్వర స్వామిని సందర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. అంతే గాక ఈ ఆలయ సమీపాన మల్లికార్జున స్వామి,రేణుక మాతల ఆలయాలు కూడా వున్నవి ఒగ్గుచప్పుల్లతో ఈ ఆలయం కూడా ఎప్పుడు కళ కళ లాడుతు ఉంటుంది. ఈ అక్కపల్లి గ్రామానికి నాలుగు దిక్కులా ఆంజనేయస్వామి ఆలయం కలవు దీనిని బట్టి చూస్తే ఈ గ్రామం అనేక పల్లెల సమాహారం అని తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామ తూర్పు దిక్కున మైసమ్మ గుట్ట మీద వెలిగే నంద దీపం ఈ గ్రామానికి మరో అద్భుత ప్రత్యేకత. ఈ నంద దీప దర్శనం అంతా శుభమని గ్రామ ప్రజల నమ్మకం. ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం తీయడం వన భోజనాలు చేయడం ఇక్కడి ఆచారం. గ్రామానికి దక్షిణాన వెంకటేశ్వర గుట్ట పై జీయరు స్వాముల విగ్రహాలు కలవు .వీటినే గ్రామస్థులు వెంకటేశ్వర స్వామిగా భావించి శ్రావణ మాసమలో పూజలు చేస్తారు.
శ్రీ బుగ్గ రామ లింగేశ్వర స్వామి ఆలయానికి ఇలా
చేరుకోండి:
తెలంగాణలో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని
అక్కపల్లి గ్రామంలో ఈ పవిత్ర శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం సిరిసిల్ల జిల్లా నుండి ఎల్లారెడ్డిపేట
మండలకేంద్రం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో అక్కపల్లి ఉంటుంది అక్కడి నుండి కోనరావు పేట వెళ్ళే మార్గంలో అటవీ
ప్రాంతంలో మహాద్భుతంగా వెలుగుతోంది.
వేములవాడ,సిరిసిల్ల నుండి కొనరావుపేట మీదుగా కూడా రావచ్చు కొనరావుపేట మండల కేంద్రము కు 3 కీ.మీ దూరం లో
ఉంటుంది.ఎల్లారెడ్డి పేట మండలం కేంద్రం నుండైనా, కొనరావు పేట మండల కేంద్రం నుండైన ఈ ఆలయానికి
చేరుకోవచ్చు.అక్కపల్లిలో అద్వితీయంగా వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం క్షేత్రగాధ, రామాయణ
కాలం
నాటి పురాతన కథలతో ముడివడిఉంది. అందుకే ఈ ఆలయానికి భక్తులు ఉప్పెనలా వస్తుంటారు. స్వయంభూలింగం, బండరాళ్ళ
పగుళ్ళ
నుంచి గలగలలుగా పారే సతత సులజధార ఆలయానికి మరింత ప్రత్యేకతలు తెస్తున్నాయి. లింగరూపాన వెలసిన జంగమదేవుడు...ఆది
మధ్యాంత రహితుడు. అభవుడు, చైతన్య స్వరూపుడు, భస్మాంబరధారి శ్రీ బుగ్గరామలింగేశ్వరుడి సందర్శనమే ఓయోగం.
జన్మజ దుఃఖ వినాశక లింగం...తత్ప్రణమామి సదాశివ లింగమ్ ....
ఆలయం సర్వతోముఖాభివృద్ధికి కర్త కర్మ క్రియగా ఆలయ ఛైర్మన్ శ్రీ కొలుగూరి
రాజేశ్వర్ రావు గారు
అహరహం
శ్రమిస్తున్నారు. ఆస్తిక మహాశయులు శ్రీ రాజేశ్వర్ రావు గారికి శివుడంటే అచంచల భక్తి విశ్వాసం. ఆ ముక్కంటికి
ముచ్చటైన ఆలయ నిర్మాణానికి అను నిత్యం పరితపించారు. అడవి మధ్యలో మారుమూలన ఉన్న శివాలయానికి వైభవాన్ని
తీసుకురావడంలో ఛైర్మన్ శ్రీ రాజేశ్వర్ రావుగారి పాత్ర అద్వితీయం. స్వతహా శైవభక్తాగ్రేసరు డైన శ్రీ రాజేశ్వర్
రావు సారథ్యంలో ఆలయం అభివృద్ధి దిశగా దూసుకెళుతోంది. ఉగాది, శ్రీరామనవమి, శివరాత్రి పర్వదినాల్లో వేడుకలు
అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యుల వెన్నంటి నడిపిస్తున్నారు ఛైర్మన్ శ్రీ కొలుగూరి రాజేశ్వర్ రావు
గారు.
ఇదీ ఆలయ కమిటీ...